యూట్యూబ్ ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన గూగుల్

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ సైట్‌కు గాను యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే యూట్యూబ్ ప్రీమియం సేవలకు నెలకు రూ.129, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలకు నెలకు రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను గూగుల్ అప్పట్లో అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్లాన్లు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేవలకు గాను ప్రీపెయిడ్ ప్లాన్లను గూగుల్ ఇవాళ లాంచ్ చేసింది. ఈ క్రమంలో యూట్యూబ్ ప్రీమియం సేవలు నెలకు రూ.139లకు, 3 నెలలకు రూ.399కి ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ రూపంలో లభిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలు నెలకు రూ.109లకు, 3 నెలలకు రూ.309లకు ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ రూపంలో లభిస్తున్నాయి.



ఈ క్రమంలో యూజర్లు ప్రీపెయిడ్ ప్లాన్లను ఎంచుకుంటే నిర్దిష్ట కాలానికి గాను యూట్యూబ్ ప్రీమియం లేదా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను వాడుకోవచ్చు. ఇక ప్లాన్ కాలపరిమితి ముగిసేలోపు మళ్లీ నెలవారీ లేదా 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్‌ను టాపప్ చేయించుకుంటే అందుకు అనుగుణంగా ఆ రెండు సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులు యూట్యూబ్‌లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి సదరు ప్రీపెయిడ్ ప్లాన్లను టాపప్ చేయించుకోవచ్చు.